తెరపైకి 'పవన్ కల్యాణ్ రాష్ట్ర యువత'... 'మెగా ఫ్యాన్స్' లో మెగా చీలిక!
ఇన్నాళ్ళూ 'మెగా' ట్యాగ్ లైన్ తో కొనసాగిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇకపై స్వంతగా సంఘం పెట్టుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు వరకు చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య ఓ స్థాయిలో ఉన్న విభేదాలు ఇటీవల కాలంలో తీవ్రమయ్యాయి. ఈ నెల 30న తిరుపతిలో 'మెగా ఫ్యాన్స్ డే' సమావేశం జరగాల్సి ఉండగా, దానికి దూరంగా ఉండాలని పవన్ ఫ్యాన్స్ కు 'హైదరాబాదు' నుంచి ఆదేశాలు వెళ్ళడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో, తాము త్వరలోనే అభిమానుల సమావేశం ఏర్పాటు చేసి, పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నెలకొల్పుతామని చిత్తూరు జిల్లా పవన్ కల్యాణ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు కిరణ్ పేర్కొన్నారు. దీనికి 'పవన్ కల్యాణ్ రాష్ట్ర యువత' అని పేరు పెడుతున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే, మెగా ఫ్యామిలీ హీరోల అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు మాత్రం చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య విభేదాలేవీ లేవని అంటున్నారు. అయితే, రాజకీయంగా పవన్ ను వ్యతిరేకిస్తామని, చిరంజీవి సోదరుడిగా ఆయనను గౌరవిస్తామని స్వామినాయుడు పేర్కొనడం విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.